యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ( వైఎస్ఆర్‌సీపీ)కి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మంగళవారం నాడు రాజీనామా చేశారు.మంగళవారంనాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీకి, నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా లావు కృష్ణ దేవరాయలు ప్రకటించారు
నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలును నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరింది. అయితే నరసరావుపేట నుండే పోటీ చేసేందుకు లావు కృష్ణదేవరాయలు ఆసక్తిగా ఉన్నారు. కానీ, గుంటూరు నుండి లావు కృష్ణ దేవరాయలు పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరుతుందనే ప్రచారం సాగుతుంది.అయితే ఈ విషయమై తన అభిప్రాయాన్ని లావు కృష్ణ దేవరాయలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని ఆయన చెబుతున్నారు.ఈ దఫా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నాయకత్వానికి చెబుతున్నారు.
నరసరావు పేట ఎంపీ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం భావిస్తుంది.ఈ క్రమంలోనే లావు కృష్ణదేవరాయలును గుంటూరుకు మార్చాలని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ప్రతిపాదిస్తుంది. అయితే నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు కూడ లావు కృష్ణ దేవరాయలును కొనసాగించాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు
గుంటూరు ఎంపీ స్థానం నుండి పోటీకి లావు కృష్ణ దేవరాయలు సానుకూలంగా లేరు. అయితే వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం నుండి ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత లావు కృష్ణ దేవరాయలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతుంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తన అభిప్రాయాన్ని లావు కృష్ణదేవరాయలు వ్యక్తం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై పార్టీ నాయకత్వం నుండి సానుకూల స్పందన రాని కారణంగానే లావు కృష్ణ దేవరాయలు రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతుంది.
తెలుగు దేశం పార్టీలో లావు కృష్ణ దేవరాయలు చేరుతారా అని మీడియా ప్రతినిధులు ఇవాళ ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్‌సీపీ వ్యూహారచన చేస్తుంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆ పార్టీ మారుస్తుంది. ఈ క్రమంలోనే టిక్కెట్లు దక్కని అసంతృప్తులు పార్టీని వీడుతున్నారు.
ఇప్పటికే కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పారు. మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడ రాజీనామా చేశారు. బాలశౌరి జనసేనలో చేరనున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.