మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి : ఇరుకుల్ల వీరేశం

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవనం గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నామని అన్నారు. నేటి సమాజంలో మనందరం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని , గాంధీ జీవితంలో ఎప్పుడు షార్ట్ కట్స్ వెతుక్కోలేదని, న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయాలు సాధించారని అన్నారు.
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ మొదలగు ఉద్యమాలు ఒక్కరోజులో వచ్చినవి కావని, గాంధీ మహనీయులు ప్రతి రోజూ నమ్మిన సిద్ధాంతం ప్రకారం నిరంతరాయంగా చేసిన కృషి ఫలితంగా ఉద్యమాలు సఫలీకృతం అయ్యాయని, ఒక్కరోజులో ఫలితం రాలేదని కలెక్టర్ పేర్కొన్నారు.
స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ జైలు శిక్ష అనుభవించడం వంటి అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, లక్ష్యాన్ని సిద్ధాంతాన్ని మరిచిపోకుండా పోరాటం సాగించారని, దాని వల్ల ఆశించిన ఫలితం లభించి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దీనిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, నిరంతరాయంగా లక్ష్యం కోసం శ్రమిస్తే ఫలితం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
మన నిత్య జీవితంలో అనేక ఒత్తిడులు వస్తాయని,
అటువంటి అవరోధాలను ఎదుర్కొంటూ మన లక్ష్యాల సాధనకు నిరంతరాయంగా శ్రమించాలని అన్నారు.
అనంతరం మహాత్మ గాంధీ స్మారక నిధి వారు రూపొందించిన మహాత్మ గాంధీ సూక్తుల పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, డి.ఎం. అండ్ హెచ్. ఓ. డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సి. సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *