వనం నుంచి జనంలోకి వచ్చిన సారలమ్మ…
డప్పు వాయిద్యాలు, శివ సత్తులు, నృత్యాలు, ప్రత్యేక పూజలతో భక్తిశ్రద్ధలతో గద్దె పైన కొలువుదీరిన సారలమ్మ
రాజాపేట, ఫిబ్రవరి 21 ప్రజా గొంతుక న్యూస్ భువనగిరి జిల్లా ప్రతినిధి:
మండలంలోని చిన్న మేడారం, చల్లూరు, లక్ష్మక్కపల్లి, ప్రాంతాలలో మూడు చోట్ల సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం సారలమ్మ తల్లి గద్దెపైకి చేరుకుంది. బూరుగుపల్లి & కుర్రారం గ్రామ పరిధిలోని చిన్న మేడారం జాతర సందర్భంగా ఎదుల గుట్ట నుండి ఊరేగింపుగా కుంకుమ భరిణ రూపం లో ఉన్న సారలమ్మ తల్లిని భక్తులు, ఆలయ పూజారులు, నిర్వాహకులు, నాయకులు, మహిళలు పాల్గొనగా నినాదాలు చేస్తూ, నృత్యాలు చేస్తూ శిగాలు ఊగుతూ డప్పు చప్పులతో అమ్మవారిని సాంప్రదాయంగా భక్తి పరవశ్యంతో గద్దె పైకి తీసుకొచ్చారు. సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న గద్దెపైకి జనసంద్రంతో పోలీసు భారీ బందోబస్తు అమ్మవారిని వనం నుండి జనంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు సంబంధిత శాఖ అధికారులు వసతులు ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాలకోసారి ప్రారంభమయ్యే అన్ని వర్గాల జాతర మొదలు కావడంతో పరిసర గ్రామాల ప్రజలతోపాటు ఆంధ్ర, మహారాష్ట్ర,చత్తీస్గడ్ రాష్ట్రాల ప్రజలు కూడా ఈ జాతరలో పాల్గొనేందుకు వచ్చారు. నాలుగు రోజులపాటు బస చేసేందుకు చల్లూరు జాతర వద్ద భక్తులు ప్రత్యేక గుడారాలు వేసుకున్నారు. యాదాద్రి మేడారం చల్లూరు జాతర సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు. పొట్టిమర్రి కూడలి, ఇబ్రహీంపురం చౌరస్తాల నుండి భక్తుల కోసం ఉచిత ఆటో రవాణా వసతి, జాతర వద్ద ఉచిత మంచినీరు, వైద్యం, విద్యుత్, వసతి ఏర్పాట్లను చేశారు. వ్యాపారస్తులకు ఉచితంగా స్థలాలను కేటాయించారు. చల్లూరు కొండల్లో ఆహ్లాద వాతావరణం లో గుట్టల పైన వెలసిన సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వనమంతా జనమయంగా మారింది. నేడు గురువారం సమ్మక్క తల్లి బూరుగుపల్లి పులిగుట్ట, చల్లూరు ఊరగుట్ట నుండి గద్దెల పైకి రానుందని నిర్వాహకులు తెలిపారు. 23వ తేదీ శుక్రవారం మొక్కులు చెల్లించే కార్యక్రమం ఉంటుందని భక్తుల అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.